నెత్తురింకిన నేల




గోండ్వానా దారి దీపాలను 
వేయి ఊడల మర్రికి వేళ్ళాడదీసావేమో 
పునాది రాళ్ళను మాత్రం పెకల్చలేకపోయావు 

మా ఊళ్ళో మా రాజ్యపు పంట కాపు 
వెన్నుపోటుకు మన్నుకరచాడేమో 
విత్తనాలను మాత్రం ఎత్తుకెళ్ళలేకపోయావు 

నా నెత్తురు నా చెమట 
నా ఆత్మగౌరవాన్ని లూఠీ చేశావేమో 
నా అస్తిత్వపు అరుణిమనైతే అందుకోలేకపోయావు 

నా పోడు శెల్కకు పట్టా 
నా పంట దినుసుకు గిట్టుబాటు 
నీ బేపార్ల దోపిడీకి అడ్డుకట్టకయి 
కొడవళ్ళుగ బిగిసిన పిడికిళ్ళు 
రగల్ జెండాలుగ ఎగిసిన నిరసనలు 
దద్దద్దరిల్లిన తుడుం మోత 
కొండకోనలు దాటిన చీమల దండులు 
వాగు వంకల ప్రవాహమై కదిలినయి 
పాలవెల్లి సంత చెంతకు చేరువైనయి 

నా ఆటపయి అధికారం 
నా పాటపయి తూటా                                                                                                         
నా మాటపయి వేటా 
నా ఆకాంక్షలపయి ఆంక్షలు విధించావు 

పులి సింహాలను గెల్చిన ఒడుపు నాది                                                                              
చట్టాల చట్టుబండలను మోయలేని జడుపూ నాదే 

నా అమాయకత్వాన్ని 
నా అశక్తతను ఆసరా చేసుకున్నావేమో 
ఉరుముల్లేని పిడుగుల్లా 
నా దేహంపై తూటాల వర్షం కురిపించావు 

చెట్టు కొగలు
పుట్ట కొగలుగ పీనుగుల పెంటయ్యాం 
పచ్చనాకు సాక్షిగా 
మరో జలియన్ వాలాబాగ్ ను చేశావు 

తడి ఆరని త్యాగాల చరితల
నిషానుగా నిలిచినోన్ని 
కుటిలత్వానికి కూలుతూ 
రేషానికి నిలబడుతూ 
తెగబడ్డప్పుడు తెల్లబడుతూ 
ఎగబడ్డప్పుడు ఎర్రబడుతూ 
బిక్కుబిక్కుమంటూ ఒంటరిగా 
మానని గాయాలతో.....
నెత్తురింకిన నేలల నేను     


                                                                                             









   



Comments

Popular posts from this blog

కవి పరిచయం

పల్లెతల్లి వొల్లెడ