కవిత్వమంటే...?


కవిత్వమంటే.....
కాకిరి బీకిరిగా కట్టెపుల్లలతో
కాకి గూడు కట్టుకోవడమే కాదు
గజిబిజిల పడకుండా
కండ్లపండుగోలె గిజిగాడు
అపురూపంగా అల్లుకున్న గూడు

కవిత్వమంటే.....
పూల గుత్తుల అత్తరును
బొత్తిగా పిండుకోవడమే కాదు
పక్క బొక్కలు తేలినా !
పక్కకు పుత్తెమంతన్నా తప్పుకొనని 
చుక్కల లెక్కల్ని తేల్చడం

కవిత్వమంటే.....
దుక్క బావిలో ఈదులాడడం
దరులకయి పాకులాడడమే కాదు
తండ్లాట తాడుతో....
తరతరాల దూప తీర్చే
బొక్కెడు నీళ్లను తోడుకోవడం

కవిత్వమంటే....
నింగికి నిచ్చెనేయడం
పాతాళానికి ఫల్టీ కొట్టడమే కాదు
మనిషితనానికయి తపిస్తూ
అగాథం అంచుల్లో సైతం  
అంకెండ్లతో దేవుకోవడం


కూకట్ల తిరుపతి 

Comments

Popular posts from this blog

కవి పరిచయం

పల్లెతల్లి వొల్లెడ