ఆకాంక్షల అల్లిక


జీవన తీరాన్ని అల్లుకోని 
తెల్లని నవ్వుల పువ్వులు 
అల్లకల్లోలపు పోకడల లోకకడలే! 

మట్టితో మమేకమైన దేహాల 
చెలిమి చెలిమెల చప్పుళ్లు 
చేను శెల్కల జీవధాతువులే! 

దయార్ధ్ర హృది చూపులు 
ద్రవీభూత మనసు పొరలు 
బండకుతికి ఆరేసిన ఎండుగ వర్ణాలే! 

జీవితాన్ని తడమని 
తడిలేని అక్షరాలు 
పొడి బట్ట స్వభావమే! 

గుండెల్ని తాకని 
పద గుంభన రాశులు 
ముక్కిపోయిన దినుసు కుప్పలే! 

అమృత తుల్యంగా 
ఆవిర్భవించు వాక్యం 
సుడులు తిరిగే ఆలోచనల్లోంచే! 

ఇగిరే రుధిరపు సెగలు 
అరిగే ఎముకల ధగధగలు 
కవిత్వం ప్రసవ వేదనే ! 

    --కూకట్ల తిరుపతి 

Comments

Popular posts from this blog

కవి పరిచయం

పల్లెతల్లి వొల్లెడ