ఇమాన్దారి....


పక్క బొక్కలు కొట్టుకపోయినా
మాట మీదనే నిటారుగ నిలవడుడు
మోట గిర్కోలే
అటో బొక్కెడు ఇటో బొక్కెడు వోసుడు
బొత్తిగ శాతగానోడు

పొట్టాపతికి
మంది సొమ్ముకు లొట్టలేసుడు
అసిద్ధంతో బరాబరీ...
కూలీనాలీ మెతుకుల్తో
కుడిసే కూడే వెయ్యికి ముడుతదనేటోడు
బొంకిచ్చిన కాడల్లా
బొక్క బోర్లవడే కుక్కపేగులోడు
కడుపుల కసరును సుతా
దులిపిచ్చు ఎన్నతడసొంటోడు

మాటకు మద్దెల కుదవవడుడు
నిట్ట నిలువున మునుగుడుకు
 
లెక్కా పక్కా లేనేలేదు
పెత్తనానికి వోయి
పేగులెల్ల దీసుకునుడంటే గిదేనేమో!
చేతిల మైల ఊడిందని
శాతనే అమ్మోలే నమ్ముకునేటోడు మల్లా

పుచ్చుకున్న కాడ పులులం కావచ్చు !
ఇచ్చుకున్న కాడ  ఈగలమేననీ
రగుత సవందాలను కండ్లకద్దుకొనేటోడు
కాళ్ళకు నీళ్లిచ్చి మందలిచ్చుడు
కడుపు నిండార్గ ముచ్చటవెట్టుడు
వాయి వరుసలతోటి నెరి పిల్వ నేర్పినోడు

పతార పటాపంచలయిన జాగల
ఉప్పు పుట్నాలకు కొరగాము
బద్నాం బురద కుంటనే
బాంచేతనమయితే బద్మాశుది
ఇమాన్దారిగ ఎల్లదీసుకోవాలనీ
ఇగురం నూరి పోసినోడు
        
--కూకట్ల తిరుపతి
            
కరీంనగర్

కూకట్ల కనకయ్య 

     


Comments

  1. మా తాత మనస‌ం‌త అ‌ందంగా ఉన్నది👌🏿👌🏿❤️❤️🌹🌷

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

కవి పరిచయం

పల్లెతల్లి వొల్లెడ