ఎట్లనుకుంటే ఎట్లయిపాయే

గలగల పారే 
మానేటి అలల్లా ఎగిరి దుంకే 
ధిక్కార స్వరం మూగవోయింది 

ముంబై పెన్నిధికీ...సిరిశాల సన్నిధికీ 
ఆసువోసిన అడుగులు 
మౌనంగా కుప్ప కూలినయి 

ప్రగతిశీల ఉద్యమాలే 
ఊపిరిగా బతికిన సగటు మనిషి 
పెన్నుగన్ను శాశ్వతంగా మూలవడ్డది 

మట్టి పొత్తిల్లలో 
బహుజన భావజాల విత్తులు జల్లిన 
నిరంతర సాహితీ కృషీవలుడు కూశైండు  

చెట్టుకొగలు పుట్టకొగలుగ కార్మికులం 
ఉక్కు పాదాలే ఉక్కిరిబిక్కిరయ్యేట్టు 
మేల్కొల్పిన సూత్రధారుడు చుక్కల్ల గల్సిండు 

ఒడ్డుకు చేరని ఓడలా 
వలస రెక్కల రెపరెలు 
తెగిన దారం పోగులా 
కన్నపేగుల కలవరింపులు 
కంటికేడు ధారలుగ 
కవన లోకపు పలకరింతలు 
ఉదీమానుల గుండె గూడున 
ఉదయించే  ప్రభాకరుడు 

ఎట్లనుకుంటే ఎట్లయిపాయే 
అయినా ...నువ్వట్లా !
వెళ్ళిపోయేది గాకుండే ?

(జనవరి 23,2018న  అమరులైన
 కామ్రేడ్ మచ్చ ప్రభాకర్ స్మృతిలో..... )

          ----కూకట్ల తిరుపతి 
    

Comments

Popular posts from this blog

కవి పరిచయం

పల్లెతల్లి వొల్లెడ